సదాచార మరియు సనాతన సంప్రదాయ పునరుద్ధరణ సంస్థ
(SADACARA AND SANATANA TRADITIONS REVIVAL INSTITUTE)
సమాజంలో నేరప్రవృత్తి బాగా పెరుగుతోంది. అవినీతి మితిమీరుతోంది. యువత విచ్చలవిడితనం చాలా ఎక్కువయ్యింది. అశాంతి, సంఘర్షణ, అనుమానం, భయం మొదలైన లక్షణాలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఈ పోకడలను ఆపడం ఎలా? మనస్తత్వశాస్త్రంలో ఈ లక్షణాలకు, ఈ లక్షణాల సముదాయానికి పేర్లు కనిపెట్టారేకానీ సమధానాలు సామాన్యుడికి అర్థమయ్యే విధంగా దొరకడం లేదు.
సృష్టిలో ప్రతి జీవి హాయిగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది. ప్రత్యేకించి మానవులు ఇలా హాయిగా, ఆనందంగా ఉండలేక పోతున్నారు. కారణం ఏమిటో ఒకసారి ఆలోచిద్దాం. ఇరవై సంవత్సరాల యువకుడొకడు వైద్యుడి దగ్గరకు వచ్చి జీవితం మీద విరక్తి కలిగిందని చెప్పాడు. ఏవేవో ఆలోచనలు వాటంతట అవే వస్తున్నాయని వాపోయాడు. వైద్యుడు ఆ యువకుడికి జీవితానికి గల అర్థం పరమార్థం చెప్పాడు. అనవసరపు ఆలోచనలు మానేయమన్నాడు. ఆలోచనలు తనకు తానే మానేయ గలిగితే ఇక వైద్యుని దగ్గరకు రావలసిన అవసరం ఏమిటన్నాడు ఆ కుర్రవాడు.
ఎందుకింత ఆందోళన? ఈ అశాంతికి కారణం ఏమిటి? కొన్ని తరాల పూర్వం మన తాతలు, తండ్రుల్లో ఇంత సంఘర్షణ లేదు కదా! విద్యుత్తు, రవాణా, సమచార వ్యవస్థ వంటి సౌకర్యాలు ఏమీ లేనప్పుడు కూడా వాళ్ళు ఆనందంగా ఉన్నారు కదా! శాస్త్ర విజ్ఞానాలు నేడింత అభివృద్ధి చెందినా మనం ఎందుకింత అసౌకర్యంగా ఉన్నాం, అశాంతిగా ఉన్నాం?
ఆ రోజుల్లొ వారి బలం - నైతికత, తృప్తి, ఇతరుల ధనం లేదా వస్తువులను ఆశించకుండా ఉండటం, సంప్రదాయ బద్ధమైన జీవన విధానం, సనాతన పద్ధతుల పట్ల గౌరవం, సత్సంప్రదాయాలను ఆచరించాలనే ఆసక్తి, సదాచార పరాయణత. మనం ఆ విలువలను ఎలా పోగొట్టుకున్నాం?
మన పెద్దలు రెండు శతాబ్దాలకు పైగా ఆంగ్లేయుల పాలనలో మగ్గినా కట్టు, బొట్టు పద్ధతులు పోగొట్టుకోలేదు. ఇప్పటి యువత పాశ్ఛాత్య వేషధారణ వైపు, వికృతమైన అలవాట్ల వైపు ఎందుకు మొగ్గుతున్నారు? మనం అభివృద్ధి చేసుకుంటున్న సైన్సు మనల్ని ఎందుకు హాయిగా ఉంచలేక పోతోంది? బయటి వస్తువుల్లో సుఖం వెతుక్కుంటున్న సగటు మనిషి, ఆనందాన్ని పొందలేకపోతున్నాడు. ఉదాహరణకు వేసవిలో ఎయిర్ కూలర్ ముందు కూచుంటే హాయిగా ఉంటుందన్న భావన, కరెంటు పోగానే రెట్టింపు చికాకు. ఏసీ బోగీలో ప్రయాణిస్తూ చల్లదనం ఎక్కువగా ఉందని బాధ పడే వ్యక్తులను మనం చూడచ్చు. దీనికి కారణం మనసే. నేటి యువ తరానికి కొంత శిక్షణ అవసరం. ప్రత్యేకించి మనస్సు గురించి, దాని స్వభావం గురించి శిక్షణ పొందిన మనిషి - ఏ పరిస్థితులలోనైనా ఆనందంగా ఉండగలడు. శిక్షణ లేని మనసు నిరంతరం కలవరానికి గురవుతూనే ఉంటుంది.
మన సంస్కృతి చాలా పురాతనమైనది. తృప్తిని, ఆనందాన్ని పొందే పద్ధతులు తెలుసుకుంటే మనిషి హాయిగా ఉండగలడు. జీవితం యొక్క అర్థం , మనసు స్వభావం, బుద్ధిని ఉపయోగించే మెలకువలు నేర్పే విద్య మనకు కావాలి. కాలేజీలలో, పాఠశాలల్లో మంచి కథలు, నీతి బోధనలు, సత్పురుషుల చరిత్రలు చెప్పబడటం లేదు. పిల్లవానికి మొదటి గురువుగా తల్లి తన వంతు పాత్రను నిర్వహించటంలో తగిన సమర్థత చూపలేక పోతోంది. ప్రత్యేకించి ఒక పదిహేను, ఇరవై సంవత్సరాలుగా ఆధునిక విద్య పేరిట సనాతన విద్యను నేర్పకపోవడం ద్వారా ఈ తరం తల్లులు తమ పిల్లలకు నైతిక విద్యను బోధించలేక పోతున్నారు. తమకే తెలియనీది వేరొకరికి చెప్పాలేరు కదా.
ఉరుకులు పరుగుల జీవితాలు, ఇద్దరూ ఉద్యోగాలు చేస్తేనేగాని నడవని సంసారాల కారణంగా పిల్లల కోసం తగిన సమయాన్ని తల్లి దండ్రులు కేటాయించలేకపోతున్నారు. దీనికి తోడు టెలివిజన్, మవిషికి కావలసిన మంచి విద్యను ఇవ్వలేక పోతోంది. ఏ ఛానల్లో చూసినా ద్వేషము, పగ, ప్రతీకారము, ఒకరినొకరు అసహ్యించుకొనే దృశ్యములు. ఒంటినిండా సరిగా బట్టకట్టుకోని స్త్రీలను అసహ్యముగా చూపుట, మగవారిని త్రాగుబోతులుగాను, రౌడీలగాను చిత్రీకరించుట చూపిస్తూ ఉంటే నేటి యువత పెడత్రోవ పట్టక ఎమవుతుంది? తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం, డబ్బును సంపాదించడమే ధ్యేయంగా గల సీరియల్స్ నిర్మించే దృక్పథం, నేటి యువత అశాంతికి, సంఘర్షణకు కారణాలు. ఈ విషయం మీద మేధావి వర్గం తమ గళం విప్పాలి. చుక్కానిలేని పడవలో ప్రయాణిస్తున్న నేటి యువతను తృప్తి, శాంతి అనే ఒడ్డుకు చేర్చాలి. ఇది ఏ ఒక్క సంస్థో, ఏ ఒక్క వ్యక్తి బాధ్యతో కాదు. అందరి సమష్టి కృషి అవసరం.
తల్లిదండ్రులకు, వారి పిల్లలకు మంచి మార్గాలు బొధించే సంస్థలు, వ్యక్తులు కావాలి. కులమునకు, మతమునకు, వర్గమునకు అతీతమైన స్థితిలో మానవత్వ విలువలు కలిగి ఆ విలువలు తిరిగి నేర్పింప గలిగినవారు ఈ సత్కార్యానికి పూనుకోవాలి. సమాజం కుళ్ళిపోతోందని బాధపడటం కాకుండా తమవంతు పాత్రను నిర్వహించగలిగే సమర్థులైన వ్యక్తులు నడుము కట్టవలసిన సమయమాసన్నమైంది. ఏ వ్యక్తిని, మతమును, ధార్మిక సంస్థను విమర్శించడం కాకుండా, మానవతా విలువలను, సనాతన సాంప్రదాయ పద్ధతులను నేటి యువతరానికి బోధించగలగాలి. ఇటువంటి వారు తాము స్వతహాగా సదాచార పరాయణులై ఉండాలి. అదర్శవంతులుగా నిలవగలగాలి.
పగ, ప్రతీకారం స్థానంలో ప్రేమను, ఆప్యాయతను నింపాలి. పోటీ కాలాన్నీ సాటి వారికి ఉపయోగపడే కాలంగా మార్చాలి. మా ఇంటికొస్తే యేం తెస్తావ్? మీ యింటి కొస్తే యేం యిస్తావ్? అనే స్థితి నుండి తాము ఇతరులకు యేమి ఇవ్వగలము అనే స్థితికి మనిషిలో మార్పురావాలి. తనకున్నది చాలు అనే భావం బాగా నాటుకోవాలి. సమాజంలో చాలామంది కన్నా మెరుగుగా బ్రతుకుతున్నవారు తమకంటే తక్కువ స్థాయివారి గురించి ఆలోచించడము మొదలు పెట్టాలి. పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళము అనే సూక్తి తెలిసికూడా ఇతరులను దోచుకుంటున్న వ్యక్తులకు సరియైన మార్గాన్ని చూపించగలగాలి.
ఒక దేవుని పేరు మీదనో లేదా ఒక మతం పేరు మీదనో ఇతరులకు బోధచేయడం కన్నా మానవ జీవిత విలువలను విడమరచి చెప్పగలగాలి. ఇటువంటి తపన కలిగిన వ్యక్తులు ఒక చోట చేరి ఈ విషయములన్నిటి మీదా చక్కని ప్రణాళిక ఆలోచించి, ఆచరించటానికి ప్రయత్నించాలి. అటువంటి వారికి సాదర స్వాగతం
పలుకుతోంది మా సంస్థ. చీకటిని పారద్రోలటానికి వెలుతురు తేవటం ఒక్కటే మార్గం. సమాజంలో కుళ్ళును కడిగి వేయటానికి ప్రయత్నించడం కంటే మంచిని పెంచడానికి పాటు పడాలి. కుటుంబంలో ఒకరిని ఒకరు గౌరవించుకొనడం మొదట నేర్పాలి. ఆత్మన్యూనతాభావాన్ని విడిచి అందరూ సమానమే అని, తాను శక్తిమంతుడనని, తాను కూడా మంచి వాడుగా ఉండగలననే ఒక స్థైర్యాన్ని, ధైర్యాన్ని అందరిలో నింపాలి. ద్వేషం వద్దు, ప్రేమ కావాలి. అసహ్యించుకోవడం వద్దు,ఆత్మీయత కావాలి. నాకేమీ వద్దు, ఎదుటివానికి ఏమివ్వగలనని ఆలోచించాలి.
మన సంప్రదాయంలో చెప్పబడిన "లోకా సమస్తా స్సుఖినో భవంతు" అనే నానుడి నిత్య సత్యం కావాలి. రండి, కదలిరండి, ఒకరి మధ్య ఒకరికి బేధ భావాన్ని పోగొడదాం. అందరినీ "మంచి" అనే ఒకత్రాటి మీదకి తెద్దాం. చెడ్డవారిని ద్వేషించనక్కరలేదు. వారిని ప్రేమిద్దాం. ఆత్మీయత, అనురాగాల్ని కుటుంబాలలో నింపుదాం. ఉడతాభక్తి గా ప్రతి ఒక్కరం మనవంతు పాత్రను నిర్వహిద్దాం. ఉద్యమాల పేరిట విధ్వంసాలు వద్దు. రాజకీయాల పేరిట మారణకాండలు వద్దు. మతం పేరిట మానవత్వాన్ని మంట కలపవద్దు. కులాల పేరిట కుమ్ములాటలు వద్దు. అందరం ఒకటే. విభజించి, పాలించు అనే పద్దతికి స్వస్తి చెప్పి, అందరినీ కలిపి, కలిసి నడుద్దాం అనే పద్ధతి నేర్పిద్దాం. ఇది కూడా ఒక ఉద్యమమే.
లోకంలో కావలసినంత మంచి ఉంది. అందరూ నడుం కడితే మంచి ఇంకా పెరుగుతుంది. సమాజం లో చెడు చాలా కనిపిస్తోంది. చెడు ఎక్కువగా కనిపించడానికి కారణం చెడు చాలా తొందరగా వ్యక్తమవుతూ వుంటుంది. మంచివారు తొందరగా కనపడరు. ఉదాహరణకు ఆహారంలో కొంచెం ఉప్పు ఎక్కువైనా తెలుస్తుంది. అదే కొంచెం తీపి ఎక్కువైతే మనం గుర్తించలేం కదా.
ఈ శిక్షణ ఎవరు ఇస్తారు. శిక్షణ ఎలా ఇస్తారు?
సదాచార, సనాతన సంప్రదాయ పునరుద్దరణ సంస్థ ఈ శిక్షణ బాధ్యత స్వీకరిస్తోంది. ప్రతి కళాశాలలోనూ, కార్యాలయాలలోను మా సంస్థ కార్యకర్తలు ఉచితముగా శిక్షణ ఇవ్వగలరు.
శిక్షణ అంశాలు
1) మన సంప్రదాయం
2) నైతిక విలువలు
3) ఆనందంగా జీవించటం ఎలా?
4) కృత్రిమ జీవనం నుండి సహజ జీవిన వైపు మళ్ళటం ఎలా?
ఈ ప్రయత్నం లో కలిసి పని చేద్దాం అని అనుకున్నవాళ్ళెవరైనా సంప్రదించ వలసిన చిరునామా:-
SADACARA AND SANATANA TRADITIONS REVIVAL INSTITUTE
Medha Study Centre,
8-3-318/6/5/1, Yousufguda main road, Hyderabad 73.
phone 98666 81193 e-mail: vrk.sastri@gmail.com
-- వి వి రామకృష్ణ శాస్త్రి
Sunday, February 10, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment